ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొత్తగాలి

తాటి ఆకుల్లో రాసిన మనుధర్మాలను పాతరెయ్యాలి
రాగి రేకుల్లో, రాతి పలకల్లో కనుమూసిన చరితకు ప్రాణం పొయ్యాలి
నాగరికతలోని ప్రతి దశలోనూ ఆమె అంతర్భాగం
ఆమె అడుగుల్లో పుట్టే చైతన్యం లోకానికి ప్రగతిపథం

చిన్నారుల నుంచి... ముదివగ్గులదాకా తప్పని వికృత చేష్టలు
పట్టపగలే వెంటాడుతున్న మానవ మృగాలు
మురికి కాలువల్లో తేలుతున్న గర్భస్థ పిండాలు
యుగయుగాల చరితలో మాననిగాయాలు

బంధువులే రాబంధులై రక్కుతుంటే
గొంతు పెగలడంలేదు
రోజుకో నిర్భయ... పూటకో అభయ...
గంటకో రమిజాబీ... గడియకో మాయాత్యాగి బలౌతుంటే
గుండెగాయం మానడంలేదు

ఇపుడిపుడే వీస్తోంది కొత్తగాలి
పడమటిగాలిని...మనుధర్మ ధూళినీ తట్టుకొని
ఇపుడిపుడే వీస్తోంది సరికొత్తగాలి
ఆనందవార్నిధియై.. అభ్యుదయవాహినియై

ఓ ఆధునిక మహిళా...
ఎదురుచూడకు... ఎవరోవస్తారని... ఏదోచేస్తారని
ఆత్మవిశ్వాసం నీ ఆయుధం
స్వేచ్ఛా సమానత్వం నీ వారసత్వం
అదిగదిగో నవయుగం... పూరించు నారీ శంఖం

- రాజాబాబు కంచర్ల
07-03-2017

(అంతర్జాతీయ మహిళాదినోత్సవం(08-03-2017) సందర్భంగా
సాహితీస్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన జనకవనంలో చదివిన కవిత)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్