ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యుద్ధం

అది యుద్ధ భూమి
అదీ యుద్ధ భూమి
అక్కడ కత్తులూ కటారులుండవు
యుద్ధతంత్రాలు
కుత్తుకలు తెంచే రాజకీయ ఎత్తుగడలే వుంటాయి
అక్కడ ప్రాణాలు ఎదురొడ్డే పోరాటం వుండదు
అణచివేతలు
ఆర్థిక జీవనాడులు కర్కశంగా తెంచే కుతంత్రాలే వుంటాయి

యుద్ధం జరుగుతోంది...
యుద్ధం జరుగుతోంది సమఉజ్జీల మధ్యకాదు...
సర్కారు సేనలతోను ఆధిపత్యదారులతోను
యుద్ధం జరుగుతోంది...
మా పదవులు నొక్కేసే రాజకీయులతోను
మా స్వేచ్ఛను తొక్కేసే భూస్వాములతోను
యుద్ధం జరుగుతోంది...
ఈ యుద్ధం జరుగుతూనే వుంటుంది

ఉనికి కోసం... బతుకు కోసం...
నిరసనలతో గొంతులు పగులుతున్నాయి
లాఠీదెబ్బలతో తనువులు చిట్లుతున్నాయి
చమట లావాలా పొంగుతోంది
నెత్తురు కుతకుతమని ఉడుకుతోంది
ఉనికి కోసం... బతుకు కోసం...
యుద్ధం జరుగుతూనే వుంటుంది

కులం కూడికలు తీసివేతల మధ్య
మనువు రాతలు వెలివేతల మధ్య
ఇంకా మోస్తూనే వున్నాం కులం కుంపటిని
నత్త నెత్తిమీది గూడులా
ఇంకా అనుభవిస్తూనే వున్నాం వెలివాడల బతుకుని
విసిరేయబడిన ఎంగిలి విస్తరిలా
మనువు రాతలు చెరిగేదాకా
వెలివేతలు నిలిచేదాకా
ధిక్కార స్వరాలు వినిపిస్తూనే వుంటాయి
యుద్ధం జరుగుతూనే వుంటుంది

ఈ గడ్డపై చిమ్మే స్వేధం నా బలం
ఈ గడ్డ కోసం కార్చే రుధిరం నా త్యాగం
త్యాగాన్ని చైతన్యదీపికగా వెలిగించి
స్వేధాన్ని వేయిశక్తులుగా మొలిపించి
ఈ దేశం నాదని గర్జిస్తాను సింహంలా
నా హక్కుల కోసం యుద్ధం చేస్తాను సైనికుడిలా

ఆధునికత మాటున సాగే
ఈ వివక్ష అంతమొందలంటే... 2
ఆత్మవిశ్వాసం నింపే విశ్వనరుడో,అంబేద్కరో కావాలి
కులం కుత్తుకలు తెగనరికిన సుందరయ్య అవ్వాలి
అప్పుడే మన గొంతుకల్లో చైతన్యం మొలుస్తుంది
అప్పుడే మన బతుకుల్లో నవయుగం ప్రభవిస్తుంది

ఆ నవయుగం ప్రభవించే వరకూ
ఆ చైతన్యపతాక ఎగిరే వరకూ
యుద్ధం చెయ్యాల్సిందే...
ప్రతి క్షణం యుద్ధం చెయ్యాల్సిందే...

- రాజాబాబు కంచర్ల
24-07-2017
గుఱ్ఱం జాషువా వర్థంతి సందర్భంగా ఎంబి విజ్ఞానకేంద్రం, విజయవాడలో
నిర్వహించిన జనకవనంలో చదివిన కవిత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్