ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బాల్యం శిథిలం!

కరడు గట్టిన హృదయాలు సైతం
ద్రవిస్తోన్న దృశ్యం
ఎగురుతున్న పక్షులు సైతం
నిలబడి నిట్టూర్పులిడుస్తోన్న భీతావాహం
చివుళ్లు వేసి
మొగ్గలు తొడిగి
వికసించి
పరిమళించాల్సిన బాల్యం
మొగ్గగానే నేలరాలి
నెత్తురోడుతోంది

హత్తుకుంటోన్న నెత్తుటి ముద్దలను
ప్రవహిస్తోన్న నెత్తుటి దారలను
తనలో ఇంకించుకోలేక
తెట్ట కట్టిన నెత్తుటి మడుగుల గోసకు
చమురు నేల నిస్సత్తువగా
కన్నీరు పెడుతోంది

బాంబు దాడులు
క్షిపణుల గర్జనలు
పసిపాపల ఉసురు తీస్తోంటే...
లక్షలాది చిన్నారుల హాహాకారాలు
తల్లిదండ్రుల ఆక్రందనలు చూసి
ఎగిరే పిట్టలు ఆక్రోషిస్తున్నాయి
ఏమీ చేయలేక
చూసే కళ్లు జాలిపడుతున్నాయి
ఏదో చేయాలని...

సిరియా చమురు సంపదపై
కన్నేసిన బూచోళ్లు మాత్రం...
రెచ్చగొడుతున్నారు అంతర్యుద్ధం
చమురు వ్యాపారులు
జలగల్లా పీల్చిపీల్చి
తీర్చుకుంటున్నారు వారి తీరని దాహం
బలైపోతున్నది మాత్రం...
ముక్కుపచ్చలారని పసోళ్లు

ఇక్కడ బాల్యం ఛిద్రమౌతోంది
ఇక్కడ పసితనం శిథిలమౌతోంది
పువ్వుల్లా పరిమళించాల్సిన బాల్యం
స్వేచ్ఛగా విహరించాల్సిన విహంగం
తల్లివేరును తెంచుకొని
పొట్ట చేత పట్టి
వలస బాట పట్టి
వరస కడుతున్నారు శరణార్థం

రెక్కలు విప్పిన సామ్రాజ్యవాదాన్ని
లెక్కలు తప్పిన జాతీయవాదాన్ని
ముక్కలు చేయాలి ప్రపంచ జనావళి
మొగ్గలు పూవులై పరిమళించాలి
పక్షులు స్వేచ్చగా విహరించాలి

- రాజాబాబు కంచర్ల
09-03-2018

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్