నువ్వెందుకు... ఎప్పుడూ నా కళ్లలోనే వుంటావు.. మనసు నిండా అల్లుకొని వుంటావు...ఆ నేనేదో చెప్పాలనుకుంటాను ఏదేదో రాయాలనుకుంటాను ఇంకేదో చదవాలనుకుంటాను మరేదో గీయాలనుకుంటాను అంతలోనే నన్నావహించుకుంటావు ఇక నాదంటూ ఏమీ వుండదు అదేమని గదమాయిస్తే.. కిలకిలా నవ్వుతావు... సన్నజాజులు వికసించినట్టు పారిజాతాలు పరిమళించినట్టు ఆ నవ్వులో ఆదమరిచి నే వుంటే... ముఖమంతా సుగంధాలద్దుతావు అధరాలతో సున్నితంగా... ప్రపంచంలోని ప్రేమనంతా కళ్లలో ఒంపుకొని తేనెలఝరులను కురిపిస్తావు ఇంక నేనంటూ లేకుండా నీలో ఐక్యం చేసుకుంటావు... అందుకే... నీ నవ్వులను పూయించే ఓ క్షేత్రాన్ని కట్టుకుంటాను ప్రతి ప్రభాతాన్ని నీ కళ్లలో అద్దుతాను నీ కోసం ఎదురుచూసే సంధ్యనౌతాను ప్రతి క్షణాన్నీ నీ పాదాల కింద పరుస్తాను కరిగే క్షణాలను దాటుకొని పరుగెడుతుంటాను ఓ రోజు నువ్వొస్తావు... ఎందుకింత ప్రేమ అంటావు... ప్రేమించకుండా ఎలా వుంటాను నువ్వే నేనైనప్పుడు నా జీవితమే నీవైనప్పుడు... మళ్లీ నవ్వుతావు కిలకిలా ప్రకృతి పులకించేలా ఈ క్షేత్రం చిగురించేలా... - రాజాబాబు కంచర్ల 22-09-2017
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’