ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

'కాలాతీత వ్యక్తులు'కు షష్టిపూర్తి

       సాహిత్యంలో నవలా రచనకు ఒక ప్రత్యేక స్థానం వుంది. తెలుగు నవల పుట్టిన తర్వాత దాదాపు పాతికేళ్ల వరకు నవలా ప్రక్రియను వచన ప్రబంధంగానే వ్యవహరించారు. నవల అనే పదాన్ని వాడుకలోకి తెచ్చింది కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి. అప్పటివరకూ నవలలు రాసినవారంతా తమ గ్రంథాలను వచన ప్రబంధాలనే పిలిచేవారు. ‘The Development of English Novel’ అనే గ్రంథంలో  ‘యదార్థ జీవితాన్ని యదార్ధ దృష్టితో అధ్యయనం చేసి, దానిని గద్యరూపంలో వ్యక్తం చేసేదే నవల’ అని రిచర్డ్ క్రాస్ అనే రచయిత పేర్కొంటాడు. అలాగే ‘రచనాకాలం నందలి వాస్తవికములగు జీవితాచార వ్యవహారములను చిత్రిస్తూ... జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల’ అని మొదలి నాగభూషణ శర్మ తన ‘తెలుగు నవలా వికాశం’లో వివరించారు. అక్కడితో ఆగలేదు. ‘కవిత్వం
మీద వచనం చేసిన తిరుగుబాటు నవల. అందుచేత నవలకున్న మొదటి లక్షణంగా అది వచనంలో వుండటాన్ని చెప్పుకోవచ్చు’ అని వల్లంపాటి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా నవలకు ప్రత్యేకంగా అలంకార శాస్త్రమంటూ లేదు. ఇలావుండాలి.... అలావుండాలి అనే నిర్దేశన సూత్రాలూ లేవు. వర్ణనాత్మక సూత్రాల విశ్లేషణ నవలలో వుంటుంది. వాస్తవిక జీవితం నవలకు పునాది.  నవలలోని పాత్రలు, సంఘటనలు, కథాసంవిధానం వాస్తవిక జీవితం మీద ఆధారపడి వుండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు  సాంఘిక నవలను ‘ప్రస్తుత సంఘంనందలి ఆచార వ్యవహారాలను గమనించి అందలి లోటుపాట్లను సవరించి, సంస్కరణ పూర్వకమైన చక్కని భవిష్యత్తును చూపు అపూర్వమైన సాహిత్య సాధనం’ అని నిర్వచించాడు. ఈ నవలల్లో కూడా సంఘంలోని కుళ్లును, అవినీతిని, అక్రమ పద్ధతులను ఎలుగెత్తి చూపేవి కొన్ని అయితే... సమకాలీన సాంఘిక పరిస్థితులను  కళ్లకు కట్టినట్టు యధాతథంగా  చిత్రించేవి మరికొన్ని. ఈ కోవకు చెందినదే  డాక్టర్ పి.శ్రీదేవి (1929-1961) రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల.   తెలుగు సాహిత్యంలోని మొదటి పది పుస్తకాల్లో ‘కాలాతీత వ్యక్తులు’ నవల వుంటుంది. స్త్రీ పురుషుల  మధ్య అవినాభావ సంబంధాన్ని గురించి కూలంకషంగా చర్చించిన నవల ఇది. ఈ పుస్తకం చదువుతుంటే... 1950ల్లో వచ్చిన నవలా ఇది? అనే అనుమానం తప్పక కలుగుతుంది. స్వాతంత్ర్యానంతరం వెలువడిన నవలలో ఇదొక మంచి నవల. ఉద్యోగాలు చేసుకొంటున్న స్త్రీల సమస్యలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో అంటిపెట్టుకొని వుండే  అభాసపు విలువలను ఈ నవలలో చాలా శక్తివంతంగా చిత్రించారు రచయిత్రి. ఈ నవలలోని శైలి, భావవ్యక్తీకరణం కొత్తగా వుంటుంది. గోరాశాస్త్రి సంపాదకత్వంలో హైదరాబాద్ నుంచి వెలువడిన తెలుగు స్వతంత్రలో 7-09-1957 నుంచి 25-01-1958 వరకు 21 వారాల పాటు ధారావాహికగా వెలువడిన ఈ నవల 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నవల ఆధారంగా తెలుగులో ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) అనే సినిమాను నిర్మించారు. మనిషి జీవితంలో అరవైకి ఓ ప్రాధాన్యత వుంది. ఇప్పటికీ సాహితీప్రియుల నోళ్లలో నానుతూ షష్టి పూర్తి చేసుకున్న ఈ నవలకూ అంతే ప్రాధాన్యత వుంది. ‘స్త్రీ స్వేచ్ఛ’పునర్నిర్వచనం చేయాల్సిన ఆవశ్యకతను 5వ దశకంలోనే స్త్రీలు గుర్తించారు. అలా గుర్తించిన రచయితలలో డాక్టర్ శ్రీదేవి ఒకరు. నేటి ఆధునిక సమాజంలో పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమ వేష భాషలపై జరుగుతున్న దాడిని ప్రశ్నిస్తూ...  సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న  సామాజిక అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్త్రీ శక్తి  ప్రారంభ దశను అరవై ఏళ్ల క్రితమే ఈ నవలలో రచయిత్రి ఆవిష్కరించారు. స్త్రీ స్వేచ్ఛకు, స్త్రీ శక్తికి కొత్త నిర్వచనం చెప్పారు. భావకవిత్వంతోనూ, ఊహాత్మక ఘటనలతోనూ యువతారన్ని గాలిలో మేడలు కట్టించే రచనలొస్తున్న రోజుల్లో... ‘కాలాతీత వ్యక్తులు’ నవల పాఠకులను ఒక ఊపు ఊపింది. ఊహాప్రపంచంలో విహరిస్తున్నవారిని నిలవేసింది.... నిలదీసింది. వారిని కిందికి పడదోసింది. వారి ఆలోచనలను  గిలక్కొట్టింది. మెదడూ- హృదయం రెండూ పనిచేసేలా చేసింది. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందని గురజాడ చెబితే... స్త్రీ స్వేచ్ఛకు కొత్త నిర్వచనం రాయండని స్త్రీ జాతికి గుర్తు చేస్త్తుంది ఈ నవల రచయిత్రి. అంతేకాదు... మనకు నచ్చింది చెయ్యాలి కానీ, లోకానికి వెరవకూడదు అన్నట్లుండే ఇందిర పాత్ర అరవై ఏళ్ళ క్రితమే సృష్టించబడిందంటే ఆ రచయిత్రి కాలానికి ఎంత ఎదురీదివుంటారో అర్థం చేసుకోవచ్చు. ఏ సాహిత్యమైనా జీవితానికి చేరువగా వుండాలి. వాస్తవికతే దానికి పరమాదర్శంగా మారాలి. అటువంటి వాస్తవిక పాత్రల సజీవ సృష్టి కాలాతీత వ్యక్తులు. పురుషాధిక్య సమాజం ఏర్పరచిన చట్రంలో ఇమడడానికి ఇష్టపడని ఇందిర... ఈ నవలలో ప్రధాన పాత్ర. మరొక ముగ్ధ కళ్యాణి. చిరుగాలికే వణికే చివురుటాకు. వీరుకాక ప్రకాశం, కృష్ణమూర్తి, డాక్టర్ చక్రవర్తి ముఖ్యమైన పాత్రలు.

          ఈ నవలలోని ఇందిర పాత్ర ఒక గొప్ప సృష్టి. తన వ్యక్తిత్వాన్నే గొడుగుగా మలచుకొని గాలివానలకూ, ఉరుములూ మెరుపులకూ జడవకుండా నిర్భయంగా నడిచిపోయే బలమైన వ్యక్తిత్వమున్న స్త్రీమూర్తి. నాడు శ్రీదేవి చిత్రించిన వ్యవస్థ తీరు తెన్నులు అటు సమాజంలోను ఇటు కుటుంబంలోను నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇందిర వ్యక్తిత్వం అంచనాలకతీతం. ‘ఏ పని చేసినా నేను కళ్ళు తెరిచి చేస్తాను.ఏడుస్తూ ఏదీ చేయను.ఏం జరిగినా ఏడవను.నాకూ తక్కిన వాళ్ళకూ అదే తేడా’అంటుంది ఇందిర. ఇదీ ఆమె వ్యక్తిత్వము! ఇందిరలాంటి స్త్రీని ఆనాడేకాదు ఈనాడూ సమాజం హర్షించే పరిస్థితిలేదు. గళమెత్తి పోరాడే గొంతు కామెది. ‘ఆడదాని మనస్సు నీకు తెలీదు ప్రకాశం. బతుకులో నాకు కావలసిందొకటి- దొరుకుతున్నదింకొకటి. అంచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నా’ననే ఇందిర... ఈతరం సమాజంలో వినిపిస్తున్న స్త్రీ ధిక్కార స్వరానికి ప్రతీక. ఇందిర పాత్రలో నాయకత్వం... ప్రతినాయకత్వం వంటి భిన్న వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. ‘నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం నాది’. ‘నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తా గానీ, ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను’ అన్న అదే ఇందిరలో నాయకత్వం కనిపిస్తుంది. ‘ఇదొక పోటీ ప్రపంచం, పెద్ద చేప, చిన్న చేపను మింగుతుంది. ఈ సంధి యుగంలో అందరం గొంగళ్ళలోనే అన్నాలు తింటున్నాం’. ‘నా ఇల్లు నేను కట్టుకుంటుంటే పక్కనించి వెళ్ళే వారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చెయ్యను’ అన్నప్పుడు కనిపించిన స్వార్థంలో ప్రతి నాయకత్వం. ఈ పాత్రలోని ఔచిత్యాన్ని విశ్లేషించుకుంటూ పోతే... తన వ్యక్తిత్వం అంబరమంత విశాలం. తన మనసు సముద్రమంత లోతైనది. ఒకే పాత్రలో నాయకత్వం… మరో కాసేపు ప్రతి  నాయకత్వం కనిపించటం వల్ల ఇది కథగా అనిపించదు. ఇది ప్రతి మనిషి యొక్క వాస్తవ నైజంలా అనిపిస్తుంది. ఆయా పరిస్థితులను బట్టి మానవ నైజంలో  కనిపించే తీరుతెన్నులే ఈ మంచి చెడులు. ‘ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను’ అనగలిగే ధీరత్వం నేటి స్త్రీ అలవర్చుకోవాలి.

          అలాగే కళ్యాణి- ‘ఈ కష్టాలు, కన్నీళ్లు, ఈ దారిద్ర్యం నాకెందుకు దేవుడా’ అంటూ మదనపడే ఈ అందమైన సుకుమారి మనసు బాగా చిరపరిచితమైన స్త్రీగా మన కనుల ముందు కదలాడుతుంది. తాను అనుభవించిన కష్టాల వల్ల ప్రతి విషయాన్నీ శంకిస్తూ... దేన్ని తాకడానికైనా భయపడుతూ వుంటుంది. చివరకు తనకు తానే ఎవరికీ భారంకాకూడదని, తన కాళ్లపై తాను నిలబడాలని తన వ్యక్తిత్వాన్ని ప్రోది చేసుకుంటుంది. ఇక ప్రకాశం- చాలామంది యువకుల్లాగే ప్రకాశం పిరికివాడు, అవకాశవాది. ఏమాత్రం కష్టపడకుండా జీవితం తన చేతుల్లోకి వరంలా వచ్చేయాలనుకునే సాధారణ మగాడు. ప్రతిఘటించడమంటే భయపడే వెన్నెముక లేని వ్యక్తి. కళ్యాణిని ప్రేమిస్తాడు. ఇందిరను కోరుకుంటాడు. మేనమామ ఒత్తిడికి లొంగిపోతాడు. వేరే పెళ్లికి సిద్ధపడతాడు. తన బాధను కూడా ధైర్యంగా చెప్పుకోలేని వ్యక్తి.  మరోవ్యక్తి కృష్ణమూర్తి- ఈతనూ మనలోనివాడే. చేతినిండా డబ్బు, చుట్టూ స్నేహితులతో తిరిగే సరదా మనిషి. యవ్వన సంధ్యల్లో తప్పటడుగులు వేసినా స్థిరంగా నిలబడి వెలుగువైపు ప్రయాణించినవాడు. ఇందిర వ్యక్తిత్వపు ధగధగలకు అచ్చెరువొంది, ఆమె చేయి అందుకోడానికి సాహసించినవాడు. ప్రకాశం గానీ, కృష్ణమూర్తిగాని, డాక్టర్ చక్రవర్తి గాని- కథానాయకులుగా చెప్పడానికి వీలులేని మామూలు మనుషులు.  అవసరం, అవకాశం, పిరికితనం, స్వార్థం… ఈ గుణాలు ఎప్పుడూ కాలాతీతమే. వీటికి అంతం అంటూ వుండదు. ఈ నవల ఎప్పటికీ  కాలాతీత స్వభావం కలదే. ప్రత్యేకించి ఈ నవలలో ఏ సందేశం చెప్పలేదు. అందుకే ఈ నవలలో కాలాతీత వ్యక్తులెవరన్నది మీరే తేల్చుకోండంటూ పాఠకులకు వదిలేశారు రచయిత్రి.

           కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా పేరు తెచ్చుకున్న రచయిత్రి డాక్టర్ పి.శ్రీదేవి జన్మస్థలం అనకాపల్లి.  ఈమె రాసిన నవల ‘కాలాతీత వ్యక్తులు’ ఒక్కటే. అతి  పిన్నవయసులోనే కన్నుమూసిన ఈమె... ఈ నవల రాయడం కోసమే జన్మించిందా అనిపిస్తుంది. రచయిత్రిగా ఈమె శైలి, భాషపై పట్టు పాఠకుడిని కట్టిపడేస్తుంది. అంతకంటే కూడా మనుషుల మనస్తత్వాలపై ఈమెకున్న పట్టు తన రచనని ఉన్నత స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు. అలాగే తెలుగు సాహిత్యంలో శ్రీదేవి సృష్టించిన ఇందిర పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. రచయిత్రి చనిపోయిందన్న వార్త విన్నప్పుడు... ‘నువ్వు అద్భుత కథా ప్రపంచంలో/ ఆకాశమంత ఎత్తున పెరుగుతావని/ నీ కలంలోని సిరా/ లక్ష ఇందిరల్నీ కోటి కళ్యాణుల్నీ/ కల్పించగలదని ఆశించిన నా గుండెకు/ జవాబు ఏమని చెప్పను నేస్తం..’ అంటూ ఆచార్య నాయని కృష్ణకుమారి ఒక కవిత రాస్తారు. దీన్నిబట్టే అర్థమౌతుంది... నేటి తరానికి ప్రతినిధిగా

కనబడుతోన్న ఇందిర పాత్ర తరతరాలకూ స్ఫూర్తివంతంగానే నిలుస్తుంది.

(Sunday,September 3,2017 ప్రజాశక్తి సాహిత్య పేజీలో ప్రచురితం)
http://www.prajasakti.com/Article/Features/1961420
- రాజాబాబు కంచర్ల
9490099231

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్