ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బెదిరింపు

పట్టువదలని విక్రమార్కుడు, తిరిగి తన సైడ్ కారు స్కూటరెక్కి యమస్పీడుగా పోతున్నాడు. రాళ్లు, రప్పలు, గుంటలు, మెరకలు దాటుకుంటూ ఇంతకుముందు వచ్చినట్లుగానే అడవి కొచ్చాడు. ఆ పక్కనే స్కూటర్ స్టాండ్ వేసి, చకచకా నడుచుకుంటూ వెళ్లి ఓ చెట్టు దగ్గర ఆగాడు.  నెమ్మదిగా చెట్టుమీదకెక్కి కొమ్మల్లో దాగున్న శవాన్ని భుజాన వేసుకొని ఈసారి మరింత జాగ్రత్తగా కిందికి దిగాడు. అతికష్టం మీద శవాన్ని మోసుకుంటూ స్కూటర్ వరకూ నడిచొచ్చాడు. భుజం మీదనున్న శవాన్ని స్కూటర్ సైడ్ కారు సీటులో కూర్చోబెట్టి, నెమ్మదిగా స్కూటర్
పోనిస్తున్నాడు. కొంచెం దూరం వెళ్లగానే.. సైడ్ కారు సీట్లో వున్న శవంలోని బేతాళుడు- ‘రాజా... జారగిలపడి కూర్చోడానికి మంచి సీటు ఇచ్చావు. నా సుఖానుభూతిని నీతో పంచుకోడానికి నీకో వింత సంగతి చెబుతా  జాగ్రత్తగా విను’ అన్నాడు.

‘‘రాజా.. అమరావతీ నగరాన్ని చంద్రసేనుడనే రాజు పాలిస్తున్నాడు. ఈ మధ్య ఆయనకో వింత రోగం  సోకింది.  అంతా నేనే...  అన్నీ నేనే కనిపెట్టాను అంటూ డాంబికాలు పోతున్నాడు. అంతేకాదు... మేం వేసిన రోడ్లపై తిరుగుతూ, మేమిచ్చే పింఛన్లు తింటూ మాకు ఓటేయ్యరా? అంటూ దబాయించే వాడు.  ఇప్పుడది కాస్త  పీక్స్ చేరిపోయింది. ‘ప్రతి  నియోజకవర్గానికి పోటీ పెడుతున్నా. ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్లకే ఎక్కువ పనులు చేస్తా! ఏ ఏరియాలో ఎక్కువ మెజారిటీ వస్తే ఆ నాయకుడ్నే గౌరవిస్తా! పదవులిస్తా..! వాళ్లనే పైకి తీసుకొస్తా!! ఏ బూతులో ఎక్కువ ఓట్లు వస్తే ఆ బూత్ పైనే ఎక్కువ శ్రద్ధ పెడతా’ అంటూ ప్రజలను బెదిరించే స్థాయికి చేరిపోయాడు. అంటే- మెజారిటీ రాని నియోజకవర్గాల్ని పట్టించుకోరా? మెజారిటీ ఇవ్వని ప్రజల్ని తొక్కేస్తారా? ప్రజలందరినీ ఒకేలా చూడాల్సిన రాజ్యాధినేత ప్రజల్ని ఈ విధంగా బెదిరించడం తగునా? ఈ వింత నెక్కడైనా చూశావా? నా సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో... నీ తల వేయివక్కలవుతుంది’’అన్నాడు బేతాళుడు.

దానికి విక్రమార్కుడు చిరుదరహాసం చేస్తూ... ‘ఇది చంద్రసేనుడి అభద్రతను తెలియజేస్తోంది. అదిరించో బెదిరించో అధికారాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఆయన మాటల్లో కనిపిస్తోంది. నిజానికి ఈ రాజు గారి వ్యవహారశైలి కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్రజల్ని విభజించి పాలించడం ఆయన అలవాటు. మరోసారి అధికారం అప్పగిస్తే... అన్నంతపనీ చేస్తాడు. అయినా ఆయన పదవిలోకి వస్తేకదా తొక్కిపడేయడానికి! ఆ పని ప్రజలే చేస్తే ఓ పనైపోద్ది. ఈయనకు పోటీ అని చెప్పుకుంటున్న ప్రతిపక్ష పార్టీ కూడా తక్కువేం కాదు. అందుకే మార్పు తీసుకొస్తామని కొత్తగా ముందుకొచ్చిన కూటమికి అధికారం అప్పగించడం మంచిది. ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తారనే అనుకుంటున్నా’ అంటూ  ఓ క్షణం ఆగాడు.

విక్రమార్కుడికి మౌనభంగం కాగానే... స్కూటరు సైడ్ కారులో జారగిలపడి రెస్టు తీసుకుంటోన్న బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

- ఉదయమిత్ర
18-03-2019

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్