ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మా ఊరి చెట్టు

 ఓ రోజు....
వేసవికాలం సాయంత్రం చల్లగాలికి మా ఇంటిపైన పచార్లు చేస్తున్నా..
అప్పటివరకూ ప్రచండంగా మండిపోయిన సూర్యుడు,
తన ప్రతాపాన్ని విరమించుకుని మెల్లగా తన దిశను మార్చుకుని మౌనమునిలా మారిపోయాడు.
విరహతాపమో, ఉక్కపోతో తెలియని వేసవితాపం నుండి కూసింత ఉపశమనం కలిగించే
ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణం...

సుదూర తీరాల నుంచి ప్రియురాలు పంపిన మేఘసందేశంలా చిరుగాలి గిలిగింతలు పెడుతుంటే...
ప్రియురాలి బాహువుల్లా ఓ అందమైన అనుభూతి మనసును అల్లుకుంది.
పసుపువర్ణధారియైన సూరీడు మెల్లగా జారుకుంటుంటే..
అప్పుడప్పుడే పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి.
గత ముప్పై ఏళ్లుగా కోల్పోయిన ఇలాంటి అందమైన సాయంత్రాలను కోల్పోయానా అని
ఓ క్షణకాలం మనసు నిట్టూర్పు విడిచినా..

ఇంటిముందు వేపచెట్టుపై చేరిన పక్షుల కిలకిలరావాల వైపు దృష్టి మళ్లింది.
అలా నలువైపులా పరికిస్తున్న నా దృష్టి...
మా ఇంటి పక్కనే, పంచాయతీ ఆఫీసు  ఆవరణలో వున్న ఓ చెట్టుపై నిలిచింది.
ఆకురాలు కాలంలో సైతం పచ్చగానే వుండే ఆ చెట్టు, మిగతా కాలాల్లో మరింత దట్టంగా వుంటుంది.
మా ఊరు నాలుగురోడ్ల కూడలిలో విస్తారమైన కొమ్మలతో, మా ఊరికి కాపలాదారులా ఠీవిగా కనిపిస్తుంటుంది.
విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయని రోడ్డువైపు పెరిగే కొమ్మలను నరికేస్తున్నా...
రెక్కలు తెగిన జఠాయువులా నిబ్బరంగా వుంది, తల్లిలా ఓదార్పునిచ్చింది. తండ్రిలా పెద్దదిక్కయింది.
దాని పేరు ఏనుగువడ చెట్టు. అమ్మాయిలు పొడవైన జడకు చివరన జడగంటలు కట్టుకున్నట్లుగా,
ఆ చెట్టు పువ్వులు సన్నని పొడవైన కాడకు చివరన, వక్కపొడి రంగులో వంగపూలను పోలి గుత్తుగా వుంటాయి.
దాని కాయలు  లావుపాటి కీరదోసకాయల్లా వుంటాయి. ఒక్కో కాడకు రెండు మూడు కాయలు వేలాడుతుంటాయి.
నాకు తెలిసీ... మా చుట్టుపక్కల ఎక్కడా ఈ చెట్టు లేదు.
సుమారుగా వందేళ్ల చరిత్ర ఈ చెట్టుది.
నాలుగు రోడ్ల కూడలిలో వుండే చెట్టుకు  రెండు వైపులా రోడ్డు, ఒకవైపు గిలకల బావి వుండేది.
దానికి కాస్త ఎడంగా పంచాయతీ ఆఫీసు, దాని పక్కనే కళా వేదిక వుండేది.
ఈ కళావేదికను మేమంతా స్టేజీ అని పిలిచేవాళ్లం. (ఈ స్టేజీ గురించి మరో పోస్టులో..)
ఇప్పుడంటే... పంచాయతీ ఆఫీసుకు, చెట్టుకు మధ్యన ప్రహరీగోడ కట్టేశారు.
ఆ గోడలేనప్పుడు చెట్టుకు నలువైపులా  ఖాళీ స్థలం వుండేది.
ఆ తర్వాత... చెట్టు చుట్టూ సిమెంట్ దిమ్మ కట్టారు.
మా ఊరి గడ్డపై కన్ను తెరిచిన ఎన్నో తరాలకు సాక్షీభూతం ఆ చెట్టు...
ఎన్నో తీర్పులకు, న్యాయాన్యాయాలకు ప్రత్యక్ష సాక్షి ఆ చెట్టు.
ఊరిలో ఏ గొడవ జరిగినా తీర్పులు ఆ చెట్టు కిందే. మీటింగులు జరిగేదీ ఆ చెట్టుకిందే.
ఆడుకునే పిల్లలకు నీడనిచ్చింది...
కోతికొమ్మచ్చి ఆడే పిలగాళ్లకు చేయందించింది.
మధ్యాహ్న సమయాల్లో పిల్లగాళ్లు గోలీలాడేదీ, కాలక్షేపం కోసం పెద్దోళ్లు పేకాట ఆడేది ఆ చెట్టుకిందే.
ప్రేమికుల కొంటె సైగలకు, రహస్య సంబంధాల దాగుడుమూతలనూ చూసింది.
తరతరాల సంతోషాలను, విషాదాలనూ పంచుకుంది.
ఎండాకాలమొస్తే వృద్ధులను సేద తీర్చే ఆదరువయ్యింది...
ఉదయం సమయాల్లో వార్తాపత్రికలు చదివేదీ ఆ చెట్టుకిందే.
పండగలప్పుడు కోలాటాలు, కోడిపందేలు ఆ చెట్టు కిందే.
సాయంత్రాలు యువకుల కబుర్లూ ఆ చెట్టుకిందే.
రాత్రయితే వృద్ధులు తుండుగుడ్డ పరుచుకుని పడుకునేదీ ఆ చెట్టుకిందే.
ఉదయం, సాయంత్రాల్లో ఊరంతా ఆ గిలకల బావినుండే నీళ్లు తోడుకెళ్లే వారు.
సాయంత్రాల్లో అయితే...నీళ్ల కోసం వచ్చే అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు, పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకునేందుకు
ఆ చెట్టు కింద లేదా స్టేజీ మీద మకామ్ వేసే యువకుల సందడి అక్కడే...
సాయంత్రం అయిందంటే చాలు... సందడిగా వుండేది...
నీళ్లతోనే పెద్దపెద్ద గదుల్లా గీతలు గీసి ఉప్పు ఆట అని ఆడేవారం.
ఆ గీతలపై అడ్డుకునే వారికి దొరకకుండా ఒక గదిలో నుండి మరో గదిలోకి చొరబడుతూ...
చివరిగదిలోకి వెళ్లి ఉప్పు  అని, మళ్లీ వెనక్కి రావాల్సి వుంటుంది.
అప్పుడంటే టీవీలు లేవు గాబట్టి కుర్రాళ్లంతా రెగ్యులర్ గా ఈ ఆట ఆడేవారు.
రాత్రి సమయాల్లో గంగిరెద్దుల ఆట ఆడించేవారు.
సర్కస్ లాడే వారూ తమ ప్రదర్శనలు అక్కడే ఇచ్చేవారు.
వేసవిలో చిలగడ దుంపల బళ్లు వచ్చేవి, కుమ్మర్లు రకరకాల మట్టి కుండలను బళ్లలో వేసుకొచ్చేవారు.
ఇవి కూడా ఆ చెట్టు కిందే ఆపేవారు.
వాళ్లు తమ అమ్మకాలు చేసుకుంటూ, అక్కడే తినే  వారు, అక్కడే కునుకు తీసేవారు.
ఇంతలో సెల్ ఫోన్ మోగడంతో నా జ్ఞాపకాల ప్రపంచం నుండి బయటికొచ్చాను.
అప్పటికే చీకటిపడింది...
గూళ్లకు చేరిన పక్షులు రేపు ఎలా? అనే చింత లేకుండా నిశ్చింతగా సేదతీరుతున్నాయి.
ఇంకా చల్లని గాలి స్పృశిస్తూనే వుంది.
ఆ చెట్టుతో నాకున్న జ్ఞాపకాలు, నేను చూసిన సంఘటనల అనుభవాలు
ప్రియురాలి గాఢచుంభనం తర్వాత కలిగే ఓ మధురమైన అనుభూతిలా నన్నావరించుకున్నాయి.
ఊరిలోని ప్రతి ఒక్కరికీ ఆ చెట్టుతో ఏదోక అనుబంధం తప్పక వుంటుంది.
మా తాతల నాటి కంటే ముందు నుంచే వున్న ఈ చెట్టు...
మా ఊరిలోని మరెన్నో తరాలను, మరెంతో నాగరికతను చూస్తుందనడంలో సందేహం లేదు.
ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదుగా... మాఊరు- అజ్జంపూడి.
గన్నవరం మండలం, కృష్ణాజిల్లా. ఇప్పుడు సి.ఆర్.డి.ఎ. పరిధిలోకి వచ్చింది.
అంతర్జాతీయ విమానాశ్రాయానికి వెనుక వైపు వుంది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్లే జాతీయ రహదారిలో,
విజయవాడకు 22కిలో మీటర్ల దూరంలో, ఎయిర్ పోర్టు నుండి 2కిమీ దూరంలో వుంది.

- రాజాబాబు కంచర్ల
03-05-2019

ఫొటోలు : పెద్దోడు దుడ్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్