ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మధుర జ్ఞాపకంగా మిగిలిన ఓ స్పర్శ

మేడే దినోత్సవ శుభాకాంక్షలతో...
పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా నివాళులతో
ఒక అరుదైన జ్ఞాపకం...

----------------







అజ్జంపూడి...
కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో అదో పల్లెటూరు.
ఎయిర్ పోర్ట్ కు వెనుకవైపున వుంటుంది.
అది...మా ఊరు
నేను పుట్టి పెరిగిన ఊరు.

మా ఊరు నాలుగురోడ్ల కూడలిలో పంచాయతీ ఆఫీసు.
దానిముందు ఖాళీస్థలం... అందులో పేద్ద ఏనుగువడ చెట్టు.
ఊరిలో గొడవల తీర్పులు, మీటింగులు జరిగేది ఆ చెట్టుకిందే.
ఉదయం సమయాల్లో వార్తాపత్రికలు చదివేదీ ఆ చెట్టుకిందే.
మధ్యాహ్న సమయాల్లో పిల్లగాళ్లు గోలీలాడేదీ ఆ చెట్టుకిందే.
సాయంత్రాలు యువకుల కబుర్లూ ఆ చెట్టుకిందే.
రాత్రయితే వృద్ధులు తుండుగుడ్డ పరుచుకుని పడుకునేదీ ఆ చెట్టుకిందే.
నాకో చిరు స్పర్శ... మధుర జ్ఞాపకంగా మిగిలిందీ ఆ చెట్టుకిందే.
(ఇప్పుడు పంచాయతీ ఆఫీసు చుట్టూ ప్రహరీ గోడ, ఆ చెట్టు చుట్టూ పెద్ద దిమ్మ కట్టారు లెండి)

ఆ రోజు కూడా ఏదో మీటింగ్ ఉందట. చెట్టుకింద జనాల హడావుడి కొంచెం ఎక్కువగానే వుంది.
చిన్నా పెద్దా ముసలీ ముక్కా అంతా పోగయ్యారు.
పంచాయతీ ఆఫీసులోని చెక్క కుర్చీలు రెండు ఆ చెట్టు కింద వేశారు.
అంతా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు.
అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా...
నాతోపాటే ఇంకొంతమంది పిల్లలూ పోగయ్యారక్కడ.
కాసేపటికి తెల్ల లాల్చీ, తెల్ల పైజామాతో వున్న ఒకాయన, మరికొందరు వచ్చారు.
సుందరయ్య గారొచ్చారు... సుందరయ్య గారొచ్చారు... అంటూ ఒక్కసారిగా హడావుడి ప్రారంభమైంది.
వస్తున్నవాళ్ల వైపు చూశాను గానీ... వారిలో సుందరయ్య గారెవరో తెలియలేదు.
కానీ... ఆయన గురించి మాత్రం అప్పటికే నాకు తెలుసు.

మా ఊళ్లో బుర్రే ఏశోబు అని ఒకాయనుండేవారు.
ఊరి మొత్తంలో ఆయనొక్కడే కమ్యూనిస్టు.
ఇంకా చాలామందే ఉన్నారంటారు గానీ...
‘నేను కమ్యూనిస్టుని’ అని గర్వంగా చెప్పుకునే ఏకైక వ్యక్తి ఆయన.
అందుకే ఆయన్నంతా కామ్రేడ్ అని పిలిచేవారు.
నేనాయన్ను కామ్రేడ్ తాతా అని పిలిచేవాడ్ని.
కామ్రేడ్ అనేది ఆయన అసలు పేరుగానే స్థిరపడిపోయింది.
ఆయన సాయంత్ర సమయాల్లో ఆ చెట్టు కిందే కూర్చొని
సుందరయ్య గారి గురించి పిల్లలకు కథలు కథలుగా చెప్పేవాడు.
ఆ కథలు వింటుంటే ఆయనొక హీరోగా అనిపించేది.
అలా నేను విన్న  కథల్లోని హీరోగా నాకు సుపరిచితులు సుందరయ్య గారు.

ఆ మీటింగ్ రోజు అంతా సుందరయ్య గారు... సుందరయ్య గారూ... అంటుంటే
నాకొకటే ఆతృత. మా కథల్లోని హీరో ఎవరో తెలుసుకోవాలని.
మా కామ్రేడ్ తాతని అడుగుదామంటే.. ఆయనేమో జనాల్లో వున్నాడు.
ఈలోపు ఒకాయన- ‘అరె... పిల్లలు మీరిక్కడెందుకురా... పోండటు’ అంటూ వెనక్కి గెంటేశాడు.
ఎలాగైనా సుందరయ్య గారెవరో తెలుసుకోవాలని... జనాల్లోంచి నెమ్మదిగా ముందుకొచ్చి ఒక కుర్చీ పక్కన నిలబడ్డా.
నా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాయన చాలా సమయమే మాట్లాడారు.
అప్పటికి మీటింగ్ ప్రారంభమై చాలా సమయమే అయింది.
మీటింగ్ పూర్తవగానే చెట్టుకింద కూర్చున్నవారంతా లేస్తున్నారు.
ఎవరికి వారే మాట్లాడుతుండటంతో గోలగోలగా వుంది.
అప్పటికీ సుందరయ్య గారెవరో నాకు తెలియలేదు.
నా పక్కనున్న కుర్చీలో కూర్చున్న లాల్చీ పైజామా ఆయన కూడా లేచి
రెండడుగులు ముందుకెళ్లి ఎవరితోనో మాట్లాడుతున్నారు.
కుర్చీ పక్కనే వున్న నేను వెంటనే ఆ కుర్చీలో కూర్చున్నా...
ఆ వెనుక వున్న ఒకాయన ‘ఏంట్రా.. జానెడులేవు,
సుందరయ్య గారు కూర్చున్న కుర్చీలో కూర్చుంటావా..’ అంటూ నెత్తిమీద ఒక్కటి మొట్టాడు.
ఆ దెబ్బకు తలపై బొప్పి కట్టింది... కళ్లలో నీళ్లు తిరిగాయి. అంత నొప్పి అనిపించింది.
అంత నొప్పిలోనూ ‘సుందరయ్య గారంటే ఈయనేనా?...’
‘నేనిప్పటి వరకూ ఈయన పక్కనే కదా నిల్చున్నా...’ అనిపించింది.
ఆ తలంపు రాగానే... మా హీరోని చూశానన్న ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరయ్యా...
నా తలపై మొట్టిన అతనన్న మాటలు విన్న సుందరయ్య గారు
తన ముందున్న వారితో మాట్లాడుతునే వెనక్కి తిరిగి చూశారు.
నవ్వుతూ ఒక చేత్తో నా తలపై నిమిరి... వాళ్లతో మాట్లాడుతూ ముందుకు కదిలారు.
ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.

ఇక నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు.
కామ్రేడ్ తాతా... కామ్రేడ్ తాతా... సుందరయ్య గారు నన్ను అంటుకున్నారు...
నా తలపై చెయ్యేసి ఇలా... అన్నాంటూ  యాక్ట్ చేసి మరీ చెప్పా.
మరేమనుకున్నావ్... సుందరయ్య గారంటే!
నేను చెప్పాగా ఆయన గురించి. ‘మనోళ్లంటే’ ఆయనకు చాలా ఇష్టం అన్నాడు.
అప్పుడు ‘మనోళ్లు’ అంటే ఏమిటో అర్థం కాలేదు...
కానీ.. అప్పటి ఆ స్పర్శ... మరువలేని ఓ మధుర జ్ఞాపకం...
ఆ జ్ఞాపకం ఎప్పటికీ సజీవం... స్ఫూర్తిదాయకం...

- రాజాబాబు కంచర్ల
21-01-2019

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్