ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉగాది కవితా పఠనం

మార్చి 18, 2018న 
జాషువా సాంస్కృతిక వేదిక  ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘ఉగాది ఉత్సవం’లో
కవితా పఠనం

ఉగాదీ... రావొద్దు నువ్వు!
--------------------------------------

రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు
ఎత్తుకు పైఎత్తులతో
రాజకీయ కుతంత్రాలతో
బలిపీఠమెక్కిన తెలుగోడి గుండెలో కత్తి దించడానికి
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు

రాజ్యం లాక్కున్న పంట పొలాల మీదుగా
రగులుతున్న రైతుల క్రోధాగ్నుల్ని పీల్చుకుంటూ
నెర్రలిచ్చిన గుండె గాయాల్ని
ఎర్రకలువల్లాంటి పాదముద్రల్ని నిలువునా చీల్చుకుంటూ
మధువు కంటే మత్తేక్కించే ద్వేషంతో
కూజితాలు పాడే మత్త కోకిల వేషంతో
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు

అంతర్జాలంలో అమరావతీ నగరం
రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనం
గారడీవాని గమ్మత్తుల పెట్టెలో ఉన్న రంగుల చిత్రం
సింగపూరు సిన్నోడి మాయాజాలం
ఊహకందని ఊహల కీకారణ్యంలో
యువత భవితను సమాధిచేసుకుంటూ
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు

నోట్ల రద్దు, జిఎస్టీ పేరుతో దేశం బజారున పడింది
నిరుడు వాడు కొట్టిన దెబ్బకు
ఈ మార్పుల కూర్పు
మనకు చేతగాని నేర్పు
గ్రామాల్లో నగరాల్లో రోడ్ల మీద
రాలిన శవాల ఆక్రందనలను ఆస్వాదిస్తూ
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా
నీ నోట పలికిన వరాల మూట
సన్మానాలు చేసి శాలువాలు కప్పినా
ఆశలు ఆకురాలిన చెట్టు మోడులా
రంగు వెలిసిన వేగుచుక్కలా నేలరాలుతుంటే
మా గుండెల్ని గాభరా పెడుతూ...
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు

బహుశా... మా స్వప్నం నిజమైతే
మట్టి చేతుల్లోంచి నేల జారిన విత్తు
మొక్కై మొలవడం ఒక అద్భుత దృశ్యం
మట్టి మీద మొలిచిన పచ్చదనం 
మళ్లీ చిగుళ్లు వేసినప్పుడు...
తరతరాలకు భవితనిచ్చే సుందర స్వప్నం
కనుల ముందు కదలాడినప్పుడు
వెన్నెలపిట్టల రెక్కల చప్పుడు సంగీతమై
మత్త కోకిల మధుర గానంతో ఆహ్వానం పలికేవరకూ
రావొద్దు ఉగాదీ రావొద్దు నువ్వు...

- రాజాబాబు కంచర్ల
18-03-2018











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్