అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’
ఇవి ‘కటికపూలే’ కాదు... పైకి కనిపించని గులాబీల సౌరభాలు. పెత్తందారీ పదఘట్టనల కింద నలిగిపోయిన మల్లెల మార్దవం. తడియారని గుండె సడి. తినే తిండి మీద, కట్టే బట్ట మీద, మాట మీద, నడక మీద, నడత మీద బోల్డన్ని ఆంక్షలు. సొంతమంచం మీద స్వేచ్చగా కూచోలేని అస్వతంత్ర బతుకుల జీవన పోరాటం ఇది. అంటరాని వసంతంలో పూసిన ‘కటికపూలు’ అరుణిమను పులుముకున్న వెలివాడల ఎర్ర మందారాలు. ఇవి కథలు కావు.. మట్టిపాదాల ముద్రలు. పెత్తందారుల పొలాల్లో లోగిళ్లలో చిందిన నెత్తురు చుక్కలు. అనుభవంలోంచి మొలిచిన అక్షరాలు గనుకే ఈ కథలకు ఇంత పదును. రచయిత తన అనుభవంలోంచి తీసుకున్న సంఘటనలు గనుకే ఈకథల కన్నీటిలో ఇన్ని ఎరుపుజీరలు. దళిత జీవితం గురించి, దళిత జనం గురించి ఇప్పుడిప్పుడే ఈ సమాజానికి తెలియజెప్పే సొంత గొంతుకలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒక పదునైన గొంతుక ఇండస్ మార్టిన్. ‘కటికపూలు’ పుస్తకం ద్వారా దళిత జీవిత చిత్రాన్ని తనదైన శైలిలో సజీవమైన, స్వచ్ఛమైన భాష, యాసతో పఠితులకందించారు.
ఈ పుస్తకంలో దళితవాడల్లో వాడే సజీవ భాష వుంది. అక్కడ మాత్రమే దొరికే అచ్చ తెలుగు పదబంధాలున్నాయి. ఈ దేశంలోని అగ్రకులాలు అంటగట్టిన కటికతనం... కరకుతనం మాటున సహజమైన సౌకుమార్యం వుంది. బతుకు చేసిన గాయాలను తట్టుకోగలిగే నిబ్బరం, నేటికోసం పోరాటం, రేపటి కోసం ఆరాటం అన్నీ కలిపితే... కటికపూలు పుస్తకంలోని 26 కథలు. ఈ కథలన్నింటా మట్టి వాసన, మనిషి వాసన, బతుకు యాతన కనిపిస్తాయి. అంతేకాదు... ఆకలి, ఆత్మగౌరవం పెనవేసుకొని వుంటాయి. ఇవి రెండూ పోటీపడుతుంటాయి. ముఖ్యంగా ప్రతి కథలోనూ ముగింపులో రచయిత తనదైన శైలిలో ఇచ్చే ముక్తాయింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేకంగా ఏ కథ గురించీ సమీక్షించట్లేదు. అలా సమీక్షించాలంటే... 26 కథల గురించీ చెప్పాలి. అందుకే ఈ కథల్లోని అంతఃస్సారాన్ని, రచయిత ఆరాటాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. క్రైస్తవ మతం దళితుల జీవితాల్లో చూపిన ప్రభావాన్ని, ఈ నేపథ్యంలో ముందుకొచ్చిన సాంస్కృతికపరమైన సున్నితమైన అంశాలను ఈ కథలన్నిట్లోనూ రచయిత చాలా చాకచక్యంగా చొప్పించాడు. దాంతోపాటు దళిత ఉప కులాల మధ్య ఉండే దగ్గరితనం, పరస్పర అవగాహననూ ఈ కథలో చిత్రించారు. దళిత సంస్కృతిలోని ఆచార వ్యవహారాలు, పెళ్లీ పేరంటాలు, అశుభకార్యాలు, తిండీ తిప్పలు వంటి పలు అంశాలు ఈ కథల్లో సహజాతి సహజంగా కనిపిస్తాయి. ఏ రచన అయినా ఆయా కాలాల రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టేదిగా వుండాలి. అటువంటి రచనలే భవిష్యత్తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించగలుగుతాయి. ఇండస్ మార్టిన్ ‘కటికపూలు’ పుస్తకం ఈ పాత్రను కచ్చితంగా నిర్వహించగలదు. అందువల్లే ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం ఇది.
- రాజాబాబు కంచర్ల
9490099231

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి