Prajasakti Posted On:
తెలుగునాట జానపద సాహిత్యానికి పుట్టినిళ్లు గ్రామాలు. శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం మౌఖిక వాజ్మయం. మౌఖిక వాజ్మయంలో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు ఉంది. జానపద సాహిత్య ప్రక్రియల్ని పాట, కథ,
సామెత, పొడుపు కథలుగా చెప్పాలి. వివిధ సందర్భాల నుంచి పుట్టుకొచ్చి ప్రజల నాలుకలపై అలవోకగా నడయాడిన చక్కటి సామెతలు, జాతీయాలు, నుడికారాలతో గుబాళిస్తూ తెలుగు లోగిళ్లలో సందడి చేస్తాయి. జీవితాన్ని మథించి, సాకి వడపోసిన అనుభవసారం ఆణిముత్యాలై నిగ్గుతేలితే- అది సామెత కావొచ్చు. అల్పాక్షరాలతో, అలతి అలతి పదాలతో అనంత వైవిధ్యాన్ని పొదువుకొనడం ఒక్క సామెతకే చెల్లు. జీవితానుభవాలన్నింటికీ అద్దం పడుతూ సరసంగానో, వ్యంగ్యంగానో వ్యాఖ్యానం చేస్తుంది సామెత. హాస్యపు జల్లు కురిపిస్తుంది. చురుక్కుమనేలా విమర్శనాస్త్రాలనూ సంధిస్తుంది. గురువులా ఉపదేశిస్తుంది. తల్లిదండ్రుల్లా తప్పొప్పులు చెబుతుంది. చమత్కారాలు, చతురోక్తులతో గిలిగింతలు పెడుతుంది. పుట్టుక నుంచి మరణం వరకూ సాగే జీవన పరిణామ దశల్లో అన్ని పార్శ్వాలను స్పృశిస్తుంది. మానవ సంబంధాల్లోని సరాగ విరాగాలన్నింటికీ సాక్ష్యంగా నిలబడుతుంది. వీటిలో భాషా సౌందర్యం, అనుభవసారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి.సామెతలు ఆయా భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. వివేకవంతమైన మాట చెప్పడం సామెత స్వభావం. ఏది చెప్పినా సంక్షిప్తంగా చెప్పడం సామెత లక్షణం. అందుకే 'సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు' అంటారు. సాధారణంగా సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లో నుంచే సామెతలను పుట్టిస్తారు. సామెతల్లో ఉన్న భేదాలను బట్టి వాటిని సూక్తులు, జనాంతికాలు, లోకోక్తులు అని కూడా అంటుంటారు. సామెతలు ప్రసంగానికి దీపాలు. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతల్లో ఒక ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్టుగా, జుంటి తేనెల విందులా ఉంటుంది. సామెతలు, జాతీయాలు భాషా వికాసానికి తోడ్పడతాయి. ఇవి మన తెలుగు భాషలో లక్షా పాతికవేల వరకూ ఉన్నాయి. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులద్దుతాయి.
సామెత ఎలా పుట్టింది?
గ్రామీణ జీవనంలో పనిపాటల్లో, జానపదుల జావళీల్లో అలవోకగా పుట్టిన పదాలే మాటలై వాక్యాలుగా మారి జనపథంలో సామెతలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ సంపద మన జాతి సంస్కృతిని ఎత్తి చూపే కరదీపిక. ప్రాచీన కాలం నుంచి ప్రజల జీవన విధానం, వారి నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆర్థిక స్థితిగతులు వంటి అనేక అంశాల విజ్ఞాన సారస్వతం మన జానపద సాహిత్యం. ఆ సాహిత్య స్రవంతిలోని ఒక ముఖ్యమైన పాయ'సామెత'. సామెత ఎందుకు ఎక్కడ ఎప్పుడు పుట్టిందో నికరంగా తేల్చి చెప్పడం కష్టం.
'కాశీకి పోయిన వాడు- కాటికి పోయినవాడు ఒక్కటే' అన్న సామెతను పరిశీలిస్తే... దేశంలో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కాలంలో ఈ సామెత పుట్టివుంటుందని ఊహించవచ్చు. కాశీకి పోయారంటే ఇక అక్కడే తనువు చాలించడమనే నమ్మకం వల్ల ఈ సామెత వచ్చి ఉంటుంది. అలాగే రామాయణ, భారతం వంటి పురాణేతిహాసాల నుంచి 'వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలి' వంటి సామెతలు ప్రజల నోళ్లలో నానుతుంటాయి. అలాగే 'మానవులుండరు కాని, మాటలు నిలిచిపోతవి'- అనేది ఒక జీవన సత్యాన్ని చెప్పే సామెత.
అలాగే రైతులు, కూలీలు తమ పనిపాట్లలో సృష్టించుకొన్న సామెతలు ఎన్నో ఉన్నాయి. మట్టికీ- మనిషికీ- ప్రకృతికీ మధ్య ఉండే సంబంధం అనిర్వచనీయం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పేవే సామెతలు. 'అదను ఎరిగి సేద్యం- పదును ఎరిగి పైరు' అన్నది వ్యవసాయదారుల అనుభవంలోంచి వచ్చిన మాట. అలాగే 'ఆరుద్ర కురిస్తే - ఆరుకార్తెలూ కురుస్తాయి' అన్నది రైతు వాతావరణాన్ని అంచనా వేసుకునే క్రమంలో వచ్చిన సామెతే. 'పాడి పసరము పసిబిడ్డ ఒక్కటే' పాడిపశువును పసిబిడ్డతో పోల్చి చూడడం, పశువును పసిబిడ్డలా సాకడం రైతు లోగిళ్లలో నిత్యకృత్యం. ఈ సందర్భాల్లోనే ఈ మాట పుట్టివుంటుంది. అంతేకాదు- 'ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు రావట' వంటి సామెతలూ సేద్యానికి సంబంధించినవే. వ్యవసాయానికి పట్టుగొమ్మ అయిన తెలుగునాట పుట్టిన సామెతలెన్నో వ్యవసాయిక విజ్ఞానాన్ని అందించే విధంగా మన పెద్దలు అందించినవే.
నన్నయ నాటి నుంచి కావ్యాల్లో సామెతలు లోకోక్తులుగా ప్రసిద్ధమైనవి ఎన్నో కనిపిస్తాయి. 'గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్' అన్నది స్థిరమైన ప్రజాసూక్తంగా నిలిచిపోయిన నన్నయ పద్యపాదం. అలాగే శిష్ట సాహిత్యాన్ని మించిన సామెతల వెల్లువ వేమన పద్యాల్లో మనకు నిండుగా కనిపిస్తాయి. ఈ పద్యాల్లోని అనేక పాదాలు సామెతలుగా తెలుగువారి నోళ్లలో నానుతున్నాయి. వ్యంగ్యం, హాస్యం, ఘాటైన చురక అలా వివిధ రూపాల్లో వేమన పద్యాలు తెలుగువారి నాలుకలపై నాట్యం చేస్తుంటాయి. 'కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా', 'పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా', 'చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా' వంటి వ్యంగ్య విమర్శనాత్మకంగా వేమన సంధించిన పద్యాలు సామెతలుగా సామాన్యుల జీవితంలోనూ భాగంగా నిలిచాయి.
సమాజంలోనూ, కుటుంబ జీవనంలోనూ మానవ సంబంధాలకు భాష్యం చెప్పే సామెతలూ ఉన్నాయి. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?' అనే సామెత పెద్దల నడవడికను బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందని తెలియజెపుతుంది. గ్రామీణ్యం పట్టణం అనే సంబంధం లేకుండా వాడుకలో ఉన్న సామెత ఇది. అలాగే 'చనువు చేసిన ఆలు చంకనెక్కు' అనే సామెత కుటుంబంలో పురుషాధిక్యతను చాటుతుంది. భార్యకు చనువు ఇవ్వకుండా అదుపాజ్ఞల్లో ఉంచాలనే భావజాలం నుంచి వచ్చిన సామెత ఇది. ఇదే భావజాలం కొడుకుల విషయంలోనూ స్పష్టం చేసే సామెత - 'తొలకరిలో చెరువు నిండినా... తొలిచూలు కొడుకు పుట్టినా మేలు' అనేది. తొలి బిడ్డగా కొడుకు పుడితే తండ్రికి సాయంగా ఉంటాడని, కూతురు పుడితే తల్లికి సాయంగా ఉంటుందనే భావం నుంచి పుట్టింది. అబ్బాయి పుడితే ప్లస్, అమ్మాయి పుడితే మైనస్ అన్న భావన నుంచి అనేక సామెతలు వచ్చాయి. అత్తా కోడళ్ల మధ్య కూడా అనేక సామెతలున్నాయి. 'అత్త మంచీ వేము తీపి లేదు', 'అత్లలేని కోడలు ఉత్తమురాలు','కోడలు లేని అత్త గుణవంతురాలు', 'పెళ్లాం బెల్లం తల్లి దయ్యం', 'అత్తను కొట్టి అటకెక్కిందట. మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట', 'అత్తపెట్టే ఆరళ్లే కనబడతాయి గానీ కోడళ్లు చేసే కొంటె పన్లు కనబడవట', 'కత్తికి మెత్తన, అత్తకు మంచి లేదు', వంటి సామెతలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి 'డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు' అనే సామెత, అలాగే ఎదుటివారితో మన్ననగా మెలగటం వంటి సందర్భాల్లో 'కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేం' అని సామెత ఎదుటివారితో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలియజెపుతుంది. వ్యంగ్యంగా మాట్లాడే సందర్భంలోనూ అనేక సామెతలు అలవోకగా విసురుతుంటారు. 'కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ', 'చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొమ్మరి గుడిసెలు', 'ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికీ ఆ ఊరు అంతే దూరం' వంటి వాటితో పరిహాసమాడటం పరిపాటే!
కొన్ని సామెతలను సూక్తులుగాను వాడుతుంటారు. 'ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే కాని తెలుపు కాదు', 'ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు', 'ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు', 'కంచు మ్రోగినట్లు కనకమ్ము మ్రోగునా', 'కొండ నాలికకు మందువేస్తే ఉన్న నాలిక ఊడిందట', 'కుడిచేత చేసిన దానం, ఎడమచెయ్యి ఎరగరాదు' వంటి అనేక సామెతలు హితోక్తులుగా వాడుతుంటారు.
తగ్గుతున్న వినియోగం
అనేక సామాజిక కారణాలవల్ల ఇవ్వాళ జానపద సాహిత్యం కనుమరుగయ్యే స్థితి ఏర్పడింది. వీటిని ఉపయోగించే సమాజం కనుమరుగయ్యే క్రమంలో మనమున్నాం. జానపద సాహిత్యానికి మాండలిక భాషా వినియోగం ప్రాతిపదిక. రవాణా, మాధ్యమం, విద్యావకాశాల వల్ల ఆధిపత్య సంస్కృతి వల్ల మాండలిక భాషా వినియోగం క్రమంగా తగ్గుతూ వస్తూంది. వ్యవహర్తలో ఆధిపత్య వర్గాల భాషా ప్రయోగం ఊపందుకుంటూ ఉంది. స్థానిక భాషా వ్యక్తీకరణ పద్ధతుల్ని భాషా రూపాల్ని న్యూనతాభావంతో చూసే స్థితి ఏర్పడింది. ఇంగ్లీషు చదువులు, మమ్మీ, డాడీ సంస్కృతి తెలుగు నుడికారానికి చెల్లుచీటి చెబుతోంది. ఇరవై ఏళ్ల క్రితం ఇతర ప్రాంతాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తి మాట్లాడితే ఏ ప్రాంతం వాడో గుర్తుపట్టగలిగే వాళ్ళం. ఇపుడా అవకాశం లేదు. వివిధ చారిత్రక, సామాజిక నేపథ్యాల నుంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన సామెతలు నేటి తరంలో ఎంతమందికి తెలుసు? రసగుళికల్లాంటి సామెతలు, జాతీయాలు ఈ తరానికి అందకుండా పోతున్నాయి. తెలుగు మాట్లాడటమే న్యూనతగా భావించే నేటి తరం ఎంతో విలువైన తెలుగు భాష, తెలుగు సంస్కృతికి దూరమౌతున్నారు. సామెత ఎప్పుడు పుట్టినా, ఎక్కడ పుట్టినా ఆ సామెతను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు సామెతల రుచిని చూపించాలి. తెలుగు భాషలోని మాధుర్యాన్ని రసపుష్టిని, హాస్య చతురతను బతికించుకోవాలంటే ఇలాంటి సామెతలను బతికించుకోవాలి.
- రాజాబాబు కంచర్ల
94900 99231
94900 99231
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి