ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నవవర్షసుందరి

ఒరియా మూలం : కుమారి తులసీదాస్
తెలుగు అనువాదం : శ్రీశ్రీ

వర్షధారను నేను వడివడిగ వచ్చాను
పరువంపు పైరులకు పచ్చదన మలరించి
స్రోతస్వినీ బాల చేతమ్ము విరియించి
వడివడిగ జడిజడిగ వచ్చాను నేను

క్షితిమీద అందాల జెండాల నెగిరించి
రసగంధ రూపాలు ప్రకృతిలో నెగడించి
జీవనానంద సంజీవనీ దేనినై
వేదనా బంధాల విదలించి వచ్చాను

బాధల, నిరాశల, విభేదాల తెమలించి
పచ్చికల బయలు పయి విహసించి
తుహిన బిందువులతో దోబూచి పచరించి
అరుణకిరణాధ్వముల హాయిగా పయనించి
వచ్చాను వచ్చాను, వర్షధారను నేను

విశ్వచైతన్య దీపికలు వెలిగించాను
ఆత్మలోతులలో అనంత రతి నించాను
సాధనా శిఖరాల శాంతి కురిపించాను
అభయమని ఈయవని నాశీర్వదించాను

రామధేనువు వోలె కదలి నే వచ్చాను
శూన్యశుష్కాత్మలకు స్తన్యసుధలిచ్చాను
విరహవిధురాగ్నులకు వేణువై, వీణనై
మదన కావ్యమరంద మధురిమలు తెచ్చాను

పూలడెందాలలో పొంగు పరిమళమట్లు
అసమశరు రసనలో మసృణడ్రుతులు నించి
స్పర్శాసుఖమ్ములో ప్రణయార్తులు హరించి
ఫేన సంకేతాలలో నవ్య సృజనతో
వడివడిగ వచ్చాను వర్షధారను నేను

నవ్యవర్షను నేను శ్రావ్యగుంజనలతో
విశ్వతో ముఖ సుఖావిర్ఫూతి తెచ్చాను
సుమమంజరుల దేహముల మీద ఆకర్ష
ణీయ చందనచర్చ చేయంగ వచ్చాను
బాలామణుల మానసాలలో అవ్యక్త
కాంక్షా కసుధాతరంగాలు నర్తించగా
శిలల పలకలమీద శేఫాలికా సితా
చ్ఛాదనము కల్పించి చల్లగా వచ్చాను

నవర్ష సుందరిని దివితేలి భువి నేలి
గ్రీష్మభీష్మ హలా హతోష్మహతి తొలగించి
స్వర్ణ ఘంటావినిక్వణ నానురణనతో
ధరణి మార్ర్మోగ కెందమ్మి నభిషేకించి
రుతువందనస్తోత్ర రుతులతో హైమాచ
లోత్తుంగ శృంగములనుద్దతిని లంఘించి
వచ్చాను వచ్చాను వర్ష బాలను నేను

(ఆకాశవాణి సౌజన్యంతో)
1966-03-23న విశాలాంధ్రలో ప్రచురణ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్