ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నాన్నా.. నన్ను క్షమించు!

'నేను తప్పుచేశాను... నన్ను క్షమించు నాన్నా... ఏ కొడుకూ తండ్రి పట్ల ప్రవర్తించని విధంగా నేను నీ పట్ల ప్రవర్తించాను' అంటూ.. సత్యమూర్తి కాళ్లపై పడతాడు రవీంద్ర.
'ఇందులో ఎవరి తప్పూ లేదురా... కాల ప్రభావం.. అంతే. వఅద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత ఇది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి మాట్లాడేవారు... వారు ఇలా మాట్లాడే స్థాయికి ఎదిగేందుకు ఓ నిచ్చెన మెట్టుగా మారిన పునాధి గురించి మర్చిపోతున్నారు. అందరూ ఉండి ఎవరూలేని అనాథలై.. కాస్తంత ప్రేమను కూడా పంచే వారులేక అల్లాడిపోతున్న ముసలి ప్రాణాల దీనస్థితికి నేటి సమాజ రోగగ్రస్థ దుస్థితే కారణం. ఈ సమాజంలో మనమూ భాగమేగా.. ఇందులో ప్రత్యేకంగా నీ తప్పు మాత్రం ఏముంది గనుక... లే నాన్నా... లే..' అంటూ కొడుకును పైకి లేపుతాడు.

'నాన్నా...' అంటూ తండ్రిని కౌగిలించుకొని బావురుమంటాడు రవీంద్ర.
'ఇన్నాళ్లూ నీ గొప్పతనం తెలుసుకోలేని గుడ్డివాణ్ణి. పద నాన్నా మనింటికెళ్దాం..' పొర్లి పొర్లి వస్తున్న ద్ణుఖాన్ని అదుపు చేసుకుంటున్నాడు. తాను చేసిన తప్పు శూలంలా గుచ్చుతోంటే.. విలవిల్లాడిపోతున్నాడు.
'మావయ్యా... అసలు తప్పంతా నాది. దీనికంతటికీ నా మూర్ఖత్వమే కారణం. నన్ను క్షమించండి. దయచేసి ఇంటికి వెళ్దాం రండీ...అంటూ కాళ్లావేళ్లా పడుతుంది శ్యామల.
'తాతయ్య... నేను కూడా నిన్ను బాధ పెట్టాను. ఇకనుంచీ మీరు చెప్పినట్టే వింటాను. రండి తాతయ్య మనింటికెళ్దాం..' అంటూ పదేళ్ల మనవడు సత్యమూర్తి కాళ్లను వాటేసుకుంటాడు.
'అలా మాట్లాడకురా చిట్టి తండ్రీ.. నువ్వు పసిపిల్లాడివి... ఇవన్నీ నీకెలా తెలుస్తాయి చెప్పు. అయినా నేనెక్కడికి వెళ్తాను. ఇక్కడేగా వుంటాను. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు...' అంటూ ఆప్యాయంగా మనవడి తలపై ముద్దు పెట్టుకుంటాడు.
'రవీ.. ఇక మీరు వెళ్లండి. రావాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావొచ్చు. ఈ ఆశ్రమంలో చాలా మందే వున్నారు కదా... వాళ్లతో కాలక్షేపం అవుతుందిలే. మిమ్నల్ని చూడాలనిపిస్తే... నేనే ఫోన్‌ చేస్తా.. సరేనా. ఇక వెళ్లండి' అంటూ ఆశ్రమం లోపలికి కదిలాడు సత్యమూర్తి... ఉబికివస్తోన్న కన్నీటిని వాళ్లకి కనబడనీయకుండా...

***

సత్యమూర్తి టీచర్‌గా రిటైర్‌ అయ్యాడు. చాలా ఏళ్ల క్రితమే భార్య కాలం చేసింది. ఎక్కువగా పుస్తకాలతోటే ఆయన కాలక్షేపం. సాయంత్రాలు మాత్రం.. దగ్గరలోనే ఉన్న పార్కు వరకు వెళ్లస్తుంటాడు. అక్కడున్న కాసేపు ఎంతో ప్రశాంతంగా వుంటుంది.
కొడుకు రవీంద్ర బ్యాంకులో పనిచేస్తాడు. కోడలు శ్యామల, మనవడు చిన్నూ. ఇదీ.. సత్యమూర్తి కుటుంబం.
రవీంద్ర మంచివాడే.. కానీ తన అభిప్రాయాన్ని భార్యకు గట్టిగా చెప్పలేడు.
ఈమధ్య ఇల్లు తరచూ రణరంగంలా మారుతోంది. చిన్న విషయానికి కూడా కోడలు రాద్ధాంతం చేస్తోంది. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తోంది.
పార్కులో కూర్చున్న సత్యమూర్తికి ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన పదే పదే గుర్తొస్తోంది. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేక పోతున్నాడు. ఇంటా బయటా ఎంతో గౌరవంగా బతికి, కోడలితో మొఖం వాచేటట్లు చివాట్లు తినాల్సి వచ్చిందే అని తెగ మథనపడిపోతున్నాడు.
'శ్యామలా..శ్యామలా.. ఇప్పటివరకు లేవకపోతే ఎలా.. చిన్నూని స్కూలుకి తీసుకెళ్లాలి. నాకు బ్యాంకుకు టైమ్‌
అవుతోంది. లేవాలి తర్వాగా...' అప్పుడే మార్నింగ్‌ వాక్‌కు వెళ్లచ్చిన రవీంద్ర... ఉదయం 7గంటలైనా నిద్రమంచం
దిగని భార్యను హడావుడిగా లేపుతున్నాడు.
ఈమధ్య శ్యామలకు మరీ బద్దకం పెరిగిపోతోంది. టైమ్‌కి లేవకపోవడం వల్ల తరచూ చిన్నూ స్కూలుకి కూడా లేట్‌ అవుతోంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోగా, గట్టిగా గట్టిగా కేకలేస్తోంది. వంటగదినంతా గిన్నెల శబ్దాలతో రణరంగంలా మార్చుతోంది.
ఇవాళా అదే జరిగింది.....
వెదవ సంతాని వెదవ సంత.. ప్రశాంతంగా పడుకోడానికి లేదు. కాఫీలు టిఫినీలు వండి వార్చడంతోనే సరిపోతోంది జీవితమంతా... అని పెద్దగా కేకలేస్తూ వంటగిదిలో వెళ్లింది. వెళ్లింది మొదలు గిన్నెలతో పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ... అందరినీ తిడుతూనే వుంది.
ఈ గొడవంతా హాల్లో కూర్చొని పేపర్‌ చదువుతోన్న సత్యమూర్తికి వినిపిస్తూనే వుంది.
ఉండబట్టలేక లోపలికెళ్లి.. 'ఎందుకమ్మా... నీ పని నువ్వు చేసుకోడానికి కూడా ఇంత రాద్దాంతం చేస్తున్నావు. నువ్వు కాస్త ముందు లేస్తే పోయేదేముంది. అర్థరాత్రి వరకూ టీవీ చూస్తూనే వుంటావు. త్వరగా పడుకుంటే... ఈ గొడవంతా ఉండదు కదా..'అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
ఆ మాటలకు మరింత రెచ్చిపోయింది శ్యామల.
'.... అంటే నేనేం పని చేయకుండా టీవీ ముందే కూర్చుకుంటున్నానా. మీ అందరూ మెక్కడానికి ఎక్కడనుంచి వస్తోంది  నేను చెయ్యకపోతే.  అసలు మా మొగుడు పెళ్లాం మధ్య మీరెందుకు తలదూర్చుతారు. ఒక మూలన పడివుండక... మాకేమన్నా లక్షలు లక్షలు సంపాదించి పెట్టారా..? మీకన్నీ టైమ్‌కి అమర్చిపెట్టడానికి. పాతకాలంనాటి ఈ కొంప తప్ప...'  శ్యామల మాటలు తూటాల్లా తగులుతుంటే... మ్లానమైన ముఖంతో అక్కడినుంచి నెమ్మదిగా తన గదిలో వెళ్లిపోయాడు.
శ్యామల ఇన్నిమాటలంటున్నా... రవీంద్ర ఏం మాట్లాడకపోగా... బ్యాంకుకు వెళ్లేందుకు తన పని తాను చేసుకుపోతున్నాడు.
ఇది ఈ ఒక్కరోజు సంఘటన కాదు. సత్యమూర్తి రిటైర్‌ అయిన నాటి నుండి రోజూ ఏదోక విషయంలో గొడవ జరుగుతూనే వుంది. చివరకూ చిన్నూకు ఏదైనా మంచి చెప్పబోయినా... ఛీత్కారణే ఎదురవుతోంది.
తను ఎక్కడ తప్పు చేస్తున్నాడో సత్యమూర్తికి ఎంతకీ అర్థం కావడంలేదు. వృద్ధాప్యం ఇంత భారంగా వుంటుందా..?
పెద్దరికానికి విలువే లేదా..? అటువంటప్పుడు ఇంట్లో ఉండి ఉపయోగం ఏమిటి..? ఆ రోజంతా మదనపడుతూనే ఉన్నాడు. గదిలోనుంచి బయటకి రాలేదు.
రవీంద్ర మాత్రం హడావుడిగా రెడీ అయ్యి... చిన్నూని తీసుకొని వెళ్లిపోయాడు.
టిఫిన్‌ చేయడానికి గానీ, భోజనం చేయడానికి గానీ సత్యమూర్తిని శ్యామల పిలవలేదు. ఆయనా వెళ్లలేదు. ఎవరి గదిలో వాళ్లు ఉండిపోయారు.
ఉదయం నుంచీ ఏమీ తినకపోవడంతో కాస్త నీరసంగా అనిపించినా... సాయంత్రం పార్కుకు వెళ్లి.. రోజూ కూర్చునే చోట కూర్చొన్నాడు. మనసు మనసులో లేదు. ఇప్పుడు తానేం చేయాలి. వీళ్లకి భారమయ్యానా? ఈ సమస్యకు ఏదోక పరిష్కారం చూడాలి...'
'సార్‌..సార్‌...' పార్క్‌ వాచ్‌మెన్‌ పిలుస్తున్నాడు.
ఆలోచనల నుండి బయటపడిన సత్యమూర్తి.. ఏమిటన్నట్టుగా అతనివైపు చూశాడు.
'సార్‌... పార్క్‌ మూసేసే టైమ్‌ అయింది... మీరెప్పుడు ముందే వెళతారు కదాని..' అంటూ మధ్యలోనే ఆపేశాడు.
ఒకరిద్దరు తప్ప పార్కులో ఎవరూ లేరు. ఆలోచనల్లోపడి చాలా సమయమే గడిపేశాడు. టైమ్‌ 7గంటలైంది. చీకటి పడింది. నెమ్మదిగా లేచి ఇంటిముఖం పట్టాడు.

***

సత్యమూర్తి ఇంటికొచ్చేసరికి... రవీంద్ర, శ్యామల మధ్య ఏదో వాగ్యుద్ధం నడుస్తోంది. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు.
'మనం వేరే వెళ్లిపోదాం. ఈ ఇల్లు... ఈ వాతావరణం నాకు నచ్చలేదు. ముఖ్యంగా మీ నాన్న. ఇక ఒక్కరోజు కూడా

ఈ ఇంట్లో వుండేదిలేదు. ఆయనతో మాటలు పడాల్సిన అవసరం నాకులేదు. లేదంటే చెప్పండి.. మా పుట్టింటికి వెళ్లిపోతా...' అంటూ ముక్కు చీదుతోంది.
'అదికాదు శ్యాము.. ఆయన పెద్దాయన. ఆయన్ని వదిలి ఎక్కడికి వెళతాం. నువ్వే ఏదోవిధంగా సర్దుకో... ప్లీజ్‌...'
'మనం వేరే వెళదాం నాన్నా... తాతయ్య నన్ను కూడా తిడుతున్నారు' అంటూ చిన్నూ.
'తప్పు నాన్నా.. తాతయ్యని అలా అనకూడదు...'
'మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపటికల్లా చెప్పండి.. వేరే వెళ్లాలో.. నేను మా పుట్టింటికి వెళ్లాలో...'
సత్యమూర్తి లోపలికి రావడం చూసి విసురుగా వాళ్ల గదిలోకి వెళ్లిపోయింది శ్యామల.
'నాన్నా... మరీ...' ఎలా చెప్పాలో తెలియక గుటకలు మింగుతున్న కొడుకు అవస్థను గమనించి...
'రవీ.. నేనంతా విన్నానురా..'
'ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు... మీరైనా తన విషయంలో జోక్యం చేసుకోకుండా వుండాల్సింది. ఎప్పుడూ ఏదోకటి అంటుంటారు...' సున్నితంగానే అన్నా... రవీంద్ర మాటల్లోని అసహనం కాస్త గట్టిగానే తాకింది సత్యమూర్తిని.
'తను వినేలా లేదు నాన్నా... అందుకని...'
'వద్దురా... మీరెక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇది మీ ఇల్లు. నిశ్చంతగా వుండొచ్చు. ఇక నా సంగతంటావా.. నేను వృద్ధాశ్రమంలో చేరాలనుకుంటున్నా. రేపు నన్ను అక్కడ దింపేసి వస్తే చాలు...' సత్యమూర్తి గొంతు గాద్గదమైంది.
'వద్దు నాన్నా... ఇది మీరు సంపాదించింది. మేమే వెళతాం..'
'ఏ తల్లిదండ్రులైనా సంపాదించేది పిల్లల కోసమే రవీ... నీదీ నడిచేకాలం... నీ కొడుకుది రాబోయే కాలం... నాది
వెళ్ళే కాలం. నేనెక్కడున్నా గడిచిపోతుంది...'
'నాన్నా...' తండ్రి నిర్ణయం రవీంద్రను నిస్సహాయుడ్ని చేసింది.
'నేనేం బాధ పడటంలేదు రవీ.. బలవంతంగా వఅద్ధాశ్రమంలో చేరవలసి వస్తే బాధ తప్ప, నా అంతట నేనుగా వెళుతున్నప్పుడు బాధపడాల్సిందేముంది. పట్టణాల్లో ఊపిరాడని ఉరుకులు పరుగుల మధ్య కొట్టుకుపోతున్న జీవితాలు మీవి.  మీకు భారంగా ఉండలేను. నా ఛాదస్తాన్ని మీ మీద రుద్దలేను.'
'నాన్నా.. మరోసారి ఆలోచించండి...' అన్నాడు తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించని రవీంద్ర..
'లేదు రవీ.. నా నిర్ణయంలో మార్పులేదు. వీలైతే రేపు సెలవు పెట్టు...'
మళ్లీ ఎప్పటికి చూస్తానో... పుత్రవాత్సల్యం ఒక్కసారిగా పొంగుకొచ్చింది... రవిని కౌగలించుకున్నాడు.
'రవీ...రేపు ఇదే పరిస్థితి నీకు రాకుండా చూసుకో...' అనాలనుకున్నాడు. కాని.. మమకారం గొంతుకు అడ్డుపడింది. మనసులోని మాట గొంతులోనే ఆగిపోయింది. ఒకసారి రవి వైపు చూశాడు. ఇదే చివరిసారి అన్నంతగా... మెల్లగా తన గదిలోకి వెళ్లిపోయాడు.

***

ఉదయం 10గంటలకు కారు వఅద్ధాశ్రమం ముందు ఆగింది. రెండు బ్యాగులతో దిగాడు రవి. ఒక బ్యాగ్‌లో బట్టలు, మరో బ్యాగ్‌లో పుస్తకాలు. తర్వాత సత్యమూర్తి, చివరగా శ్యామల, చిన్నూ దిగారు.
ఆశ్రమం రిసెప్షన్‌లో ఒక వఅద్ధుడు కూర్చొని వున్నాడు. ఆయన వెనక గోడ మీద ''ఆత్మీయతకు అమ్మ ప్రతిబింబం... వాత్సల్యానికి నాన్న ప్రతిరూపం'' అని రాసివుంది. అది చదివిన రవికి గుండెల్లో కలుక్కుమంది. అయినా తమాయించుకొని...
'సార్‌.. నిన్న ఫోన్‌ చేసి అపాయింట్మెంట్‌ తీసుకున్నాం..' అన్నాడు రవి.
'రండి కూర్చోండి... పేరు, వయస్సు చెప్పండి...'
'కె.సత్యమూర్తి... వయస్సు 66ఏళ్లు..'
వివరాలు రాసుకున్న తర్వాత సంతకం పెట్టమని రిజిస్టర్‌ను ముందుకు తోశాడు రిసెప్షన్‌లో ఉన్న పెద్దాయన.
'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కానీ ఎక్కడా... ఎప్పుడు అనేది గుర్తు రావడంలేదు...'
'అవునండీ... 30ఏళ్ల క్రితం ఇక్కడే చూశారు' అన్నాడు సత్యమూర్తి.
'అవునా...' అంటూ.. అప్పటి రిజిస్టర్‌ తీసి అందులో వెరిఫై చేశాడు.
'అవును సత్యమూర్తిగారు... మీకు పిల్లలు లేరని, ఇక్కడి అనాధ శరణాలయం నుంచి రెండేళ్ల బాబుని దత్తత తీసుకున్నారు కదా! ఇప్పుడు ఆ బాబు ఉన్నాడా..?'
'ఉన్నాడు... అప్పుడు మీరిచ్చిన పసికందు... వీడే. పేరు రవీంద్ర' అంటూ రవీంద్రను చూపి... మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు సత్యమూర్తి.
ఇదంతా వింటున్న రవీంద్ర, శ్యామల నిశ్చేష్టులయ్యారు.

- రాజాబాబు కంచర్ల
14-05-2016

(ఇది నా తొలి కథ. నాకు స్ఫూర్తినిచ్చిన నా ప్రియనేస్తానికి అంకితం)
అక్టోబర్ 2, 2016 ప్రజాశక్తి ‘స్నేహ’ (సండే మ్యాగజైన్)లో ప్రచురితం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్